బెంగళూరులో ‘జాంబీ డ్ర‌గ్‌’ కలకలం.. అసలేం జరుగుతోంది?

బెంగళూరులో 'జాంబీ డ్ర‌గ్‌' కలకలం.. అసలేం జరుగుతోంది?

సిలికాన్ సిటీ బెంగళూరులో (Bengaluru) మత్తు పదార్థాల (Drugs) కలకలం రేగుతోంది. తాజాగా బాగలూరు ఏరియాలోని (Bagalur Area) ఒక కాలేజీ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఎటువంటి చలనం లేకుండా, ఒక విగ్రహంలా నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ వాహనాలు వెళ్తున్నా, జనం చూస్తున్నా అతను మాత్రం కనీసం కనురెప్ప కూడా వేయకుండా ఉండటం కలకలం రేపుతోంది.

సోషల్ మీడియాలో ‘జాంబీ డ్రగ్’ ఆందోళన
కొద్దిరోజుల క్రితమే చండీగఢ్‌లో (Chandigarh) కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఇప్పుడు బెంగళూరులోనూ అదే పునరావృతం కావడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలాజైన్ (Xylazine) అనే ప్రమాదకరమైన డ్రగ్ వల్లే మనుషులు ఇలా ‘జాంబీ’ (Zombie)లలా మారిపోతారని, ఈ డ్రగ్ ఇప్పుడు బెంగళూరుకు కూడా చేరుకుందని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

“ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి. ప్రాణాంతకమైన జాంబీ డ్రగ్ మన నగరంలోకి ప్రవేశించింది. తల్లిదండ్రులు, యువత మరియు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. బెంగళూరు మరో ‘ఉడ్తా బెంగళూరు’ (Udta Bengaluru)గా మారుతోంది” అంటూ ఒక నెటిజన్ పోస్ట్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు
ఈ వీడియో వైరల్ కావడంతో యలహంక పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అయితే, సదరు వ్యక్తి అలా ఉండటానికి కారణం డ్రగ్స్ లేక మరేదైనా అనారోగ్య సమస్యా అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

అసలేమిటీ ‘జాంబీ డ్రగ్’?
వైద్య పరిభాషలో దీనిని జైలాజైన్ (Xylazine) అని పిలుస్తారు. సాధారణంగా దీనిని గుర్రాలు, పశువులకు అనస్థీషియా (మత్తు) ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అయితే, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు దీనిని ఫెంటానిల్ లేదా హీరోయిన్ వంటి ఇతర మత్తు పదార్థాలతో కలిపి తీసుకుంటున్నారు. ఇది తీసుకున్న వారు గంటల తరబడి స్పృహ లేకుండా, శరీర కదలికలు లేకుండా ‘జాంబీ’లలా ఉండిపోతారు. దీనివల్ల శరీరంలోని చర్మం కుళ్లిపోవడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తడం మరియు చివరికి మరణం సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? అతను నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా? అన్నది తేలాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment