నకిలీ స్టాంప్స్ (Fake Stamps), ఫోర్జరీ డాక్యుమెంట్స్ (Forgery Documents) కేసులో సీబీఐ అధికారులు (CBI Officials) సంచలన అరెస్టులు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు (Late D.K. Adikesavulu Naidu) వారసులు డీకే శ్రీనివాస్ (D.K. Srinivas), కుమార్తె కల్పజలను (Daughter Kalpaja) సీబీఐ అరెస్ట్ చేసింది (CBI Arrested). వీరితో పాటు కేసుకు సహకరించిన డిప్యూటీ డీఎస్పీ మోహన్ (Deputy DSP Mohan)ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29 వరకు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో 2019లో చోటుచేసుకున్న రియల్టర్ రఘునాథ్ (Realtor Raghunath) అనుమానాస్పద మృతి కేసుతో ఈ అరెస్టులు సంబంధం ఉన్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. రఘునాథ్ 2019 మే 4న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, ఆయన భార్య మంజుల (Wife Manjula) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, నకిలీ స్టాంప్స్, ప్రభుత్వ స్టాంప్స్, నకిలీ సీల్స్ వినియోగం జరిగినట్లు సీబీఐ గుర్తించింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసుపై సీబీఐ లోతైన విచారణ కొనసాగిస్తోంది. అయితే టీడీపీ నేత కుమార్తె కల్పజ ప్రస్తుతం జనసేన పార్టీ క్రియాశీలక నేతగా ఉన్నట్లుగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దర్యాప్తులో భాగంగా డీకే శ్రీనివాస్, కల్పజలకు డిప్యూటీ డీఎస్పీ మోహన్ సహకరించినట్లు ఆధారాలు లభించడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యుల అరెస్టుతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది.
టీడీపీ నేత కుమారుడు డీకే శ్రీనివాస్ గతంలో డ్రగ్స్ కేసులో కూడా అరెస్టు కావడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజా నకిలీ స్టాంప్స్ కేసులో కీలక నిందితులుగా అరెస్టు కావడంతో, ఈ వ్యవహారం మరింత విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. సీబీఐ విచారణలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.








