పశ్చిమ బెంగాల్ (West Bengal)లో మహిళలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. గత ఏడాది కోల్‌కతా (Kolkata) ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో (RG Kar Medical College) వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ భయానక ఘటన ఇంకా ప్రజల మనసుల్లోంచి చెరిగిపోకముందే.. మరోసారి ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంతో రాష్ట్రం మళ్లీ ఉలిక్కిపడింది.
దుర్గాపూర్‌లో మరో కిరాతక ఘటన
ఒడిశా (Odisha)కు చెందిన 23 ఏళ్ల యువతి బెంగాల్‌లోని దుర్గాపూర్ (Durgapur) శోభాపూర్ సమీపంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (MBBS) చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి భోజనం కోసం కాలేజీ క్యాంపస్ నుండి బయటకు వెళ్లింది. వీరి వెంట కొంతమంది దుండగులు వెంబడించారు. ప్రమాదాన్ని గ్రహించిన స్నేహితుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పరారయ్యాడు. కానీ బాధితురాలిని వారు బలవంతంగా సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
పోలీసుల చర్యలు, ప్రజా ఆగ్రహం
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రస్తుతం బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులు, కాలేజీ సిబ్బందిని విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ప్రభుత్వం చట్టవ్యవస్థను కాపాడడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





 



