టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపించిన గాసిప్స్‌కు ముగింపు పలుకుతూ, ఆయన కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు స్పష్టమైంది. ఇప్పటికే అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చయ తాంబూలాల కార్యక్రమం నిశ్శబ్దంగా జరిగినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఏప్రిల్ 5న జరగబోయే నిశ్చితార్థంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఏప్రిల్ 29న తిరుమలలో శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనుంది. వేద మంత్రాల నడుమ పవిత్ర క్షేత్రంలో వివాహం చేసుకోవడం ద్వారా ఈ జంట తమ జీవితానికి కొత్త ఆరంభం పలకనుంది. మాస్ సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన బెల్లంకొండ శ్రీనివాస్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








