ప్రపంచ క్రికెట్ (World Cricket)లో అత్యంత సంపన్నమైన బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవతరించింది. బీసీసీఐ (BCCI) ఖాతాలో ప్రస్తుతం రూ.20 వేల కోట్లకు పైగా నిధులు(Funds )ఉన్నట్లు సమాచారం. గడిచిన ఐదేళ్లలో బోర్డు ఆదాయం మూడు రెట్లు పెరిగిందని తెలుస్తోంది. ఐపీఎల్, ఐసీసీ వాటాలు, అలాగే అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు సంబంధించిన మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,623 కోట్ల మిగులును చూపించిన బీసీసీఐ, అంతకుముందు ఏడాది (2022-23)లో రూ. 1,167 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల.
సెప్టెంబర్ 28న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు 2024 ఆర్థిక నివేదిక వివరాలు వెలువడ్డాయి. క్రీడా వర్గాల సమాచారం ప్రకారం, 2019లో కేవలం రూ.6 వేల కోట్లుగా ఉన్న బీసీసీఐ నిధులు, గత ఐదేళ్లలో రూ.14,627 కోట్లు అదనంగా సమకూరడంతో ప్రస్తుతం మొత్తం రూ.20,686 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచంలో మరే ఇతర క్రికెట్ బోర్డుకు కూడా ఇంత పెద్ద మొత్తం నిధులు లేవని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
బీసీసీఐ కార్యదర్శి సమర్పించిన నివేదికల ప్రకారం, 2019లో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెల్లించిన తర్వాత మిగిలిన బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6,059 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు అదనంగా రూ.14,627 కోట్లు వచ్చి చేరడంతో మొత్తం నిధులు రూ.20,686 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మాత్రమే రూ.4,193 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ స్టేడియాల మౌలిక సదుపాయాల కోసం రూ.1,200 కోట్లు, ప్లాటినం జూబ్లీ ఫండ్ కోసం రూ.350 కోట్లు, క్రికెట్ అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రూ.1,990 కోట్లు పంపిణీ చేసినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.








