భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI)లో త్వరలోనే కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ (Ajit Agarkar) కాంట్రాక్ట్‌ను పొడిగించకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అగర్కర్ పనితీరుపై బీసీసీఐ పూర్తిగా సంతృప్తిగా లేదన్న సమాచారం నేపథ్యంలో, కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపికపై బోర్డు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ భారత పేసర్ ఆర్పీ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కథనం ప్రకారం, అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా ఆర్పీ సింగ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్పీ సింగ్‌కు క్రికెట్‌పై లోతైన అవగాహనతో పాటు యువ ప్రతిభను గుర్తించే సామర్థ్యం ఉందన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో ఉంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, ఆ తర్వాత విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతూ ఆటపై తన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆర్పీ సింగ్‌కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు అప్పగిస్తే భారత క్రికెట్‌కు కొత్త దిశ లభించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా, అగర్కర్ కాంట్రాక్ట్‌పై తుది నిర్ణయం మరియు కొత్త సెలెక్షన్ కమిటీ నియామకంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.








