ఏపీ (AP)కి మళ్లీ వర్షగండం. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రజలు అల్లాడుతుండగా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతుండగా, వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం (Bay-of-Bengal) ప్రాంతంలో అక్టోబర్ 1న మరో అల్పపీడనం (Low-Pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, అది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారి ఉత్తర–మధ్య బంగాళాఖాతం వైపు కదలవచ్చని అంచనా.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్ ముగింపు దశలోకి ప్రవేశించగా, ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మాన్సూన్ పూర్తయింది. అక్టోబర్ రెండో వారం చివరినాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా వెనుదిరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈసారి మాన్సూన్ మొదటి అర్ధభాగంలో వర్షాభావం కనిపించినా, తరువాత చురుగ్గా కదిలి సమృద్ధిగా వర్షాలు కురిపించింది. సాధారణంగా రాష్ట్రంలో 74.5 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు 98.48 సెంటీమీటర్ల వర్షం నమోదై సాధారణం కంటే 35% ఎక్కువగా ఉంది. జిల్లాల వారీగా 7 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా, 18 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. 147 మండలాలు అత్యధిక వర్షపాతం, 291 మండలాలు అధిక వర్షపాతం నమోదు చేయగా, కేవలం 2 మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో వర్షాలతో 100 సెంటీమీటర్ల మైలురాయిని దాటే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.







