ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజలను భయపెడుతోంది. అల్పపీడనం కారణంలో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లుగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది.
అలాగే విశాఖపట్నం, కాకినాడ, తూర్పు-పడమటి గోదావరి, కోనసీమ, ఏలూరు, NTR జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని IMD సూచించింది.
ఇదే సమయంలో ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీనివల్ల వర్షపాతం ఇంకా విస్తృతమయ్యే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.







