సంక్షోభం మధ్య బంగ్లాదేశ్‌లో పోలింగ్

సంక్షోభం మధ్య బంగ్లాదేశ్‌లో పోలింగ్

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభాల నడుమ కీలక ఘట్టం ప్రారంభమైంది. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న అల్లర్లు, ప్రాణనష్టం దేశాన్ని కుదిపేసాయి. తాజాగా ఒక యువ రాజకీయ నాయకుడి హత్య అనంతరం మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఈ క్రమంలో హిందువులపై దాడులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గురువారం (12-02-2026) పార్లమెంట్ ఎన్నికలు జరగడం దేశ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారింది. ఉదయం 7:30 గంటలకు పోలింగ్ ప్రారంభమై, మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్‌పై కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నారు.

ఎన్నికల కమిషన్ ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రికి లేదా అర్ధరాత్రికి ఫలితాల ధోరణి వెల్లడయ్యే అవకాశం ఉండగా, శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 10 లక్షల భద్రతా సిబ్బందిని నియమించగా, కౌంటింగ్ ప్రక్రియ కోసం 5 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. అంతేకాకుండా, పారదర్శకత కోసం 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ దిశను నిర్ణయించే కీలక మలుపుగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment