తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య నెలకొన్న నీటి వివాదం (Water Dispute) మరో కీలక మలుపు తిరిగింది. బనకచర్ల (Banakacharla)ఎత్తిపోతల ప్రాజెక్టు (Lift Irrigation Project)పై చర్చించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కేంద్ర జలశక్తి శాఖ ( Central Jal Shakti Department) కు అధికారికంగా లేఖ రాసింది.
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగునీటి పంచాయితీపై రేపు (జులై 16) కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమక్షంలో సీఎంల(CM) భేటీ జరగనుంది. ఈ భేటీకి ముందు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టాలని కోరింది. తెలంగాణ అభ్యంతరాలు పక్కన పెట్టి చర్చ జరగాలంటూ కేంద్రానికి సూచించింది.
అయితే ఆ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. “బనకచర్ల అంశాన్ని చర్చించలేము” అంటూ సూటిగా కేంద్రానికి లేఖ రాసింది. దీంతో రేపు జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశంపై పునరాలోచన జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇరు రాష్ట్రాలు నీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, పారిశుద్ధ్య అంశాలపై స్పష్టమైన అభిప్రాయ భేదాల్లో ఉన్నాయి. ప్రత్యేకించి పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో వివాదాలు తీవ్రతరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ హస్తక్షేపంతో సీఎం ల భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బనకచర్లను తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ తెలంగాణను తన గురువు చంద్రబాబుకు సర్వం దొచిపెట్టేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి నీటి పంచాయితీపై మల్లగుల్లాలు పడతారా? లేక తమ-తమ వైఖరులపై కఠినంగా వెల్లడిస్తారా..? అన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్యపై పరిష్కారం కనుగొనాలన్న ఆశల మధ్య బనకచర్ల వివాదం మరోసారి అడ్డంకిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.