కర్ణాటక రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బళ్లారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేస్తూ సిద్ధ రామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం బళ్లారి ఎస్పీగా అధికారికంగా ఛార్జ్ తీసుకున్న పవన్ నిజ్జూర్, అదే రోజు సాయంత్రానికి సస్పెన్షన్కు గురికావడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అల్లర్ల సమయంలో జరిగిన కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటనలో సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లర్లను నియంత్రించడంలో వైఫల్యం చెందారని పేర్కొంటూ ఆయనను సస్పెండ్ చేసింది.
ఎస్పీ ఆత్మహత్యాయత్నం
ఇదిలా ఉండగా, సస్పెన్షన్ నేపథ్యంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మరింత కలవరపాటుకు గురి చేసింది. తుముకూరులోని ఓ ఫామ్ హౌస్లో నిద్ర మాత్రలు మింగినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. బళ్లారి అల్లర్ల ఘటన, ఎస్పీ సస్పెన్షన్, ఆపై ఆత్మహత్యాయత్నం వంటి పరిణామాలు కర్ణాటక పోలీసు విభాగంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.








