నందమూరి కుటుంబసభ్యులు ఏదో ఒక రూపంలో సినీ పరిశ్రమతో అనుబంధం కలిగి ఉన్నవారే. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా సినిమా రంగంలోనే పనిచేస్తున్నారు. అయితే, ఇన్నాళ్లు ఆమె తెర వెనుక పాత్రలకే పరిమితమయ్యారు. ముఖ్యంగా, ‘అన్‌స్టాపబుల్’ షోకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా, తన సోదరుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాతగా ఒక సినిమా కూడా నిర్మించనున్నారు. ఇలా కేవలం తెర వెనుక వ్యవహారాలు చూసుకున్న తేజస్విని, ఇప్పుడు తొలిసారిగా తెరపైకి వచ్చారు.
యాడ్‌తో ఎంట్రీ.. నటన అదుర్స్!
తేజస్విని తాజాగా ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ కంపెనీకి సంబంధించిన ఒక జ్యువెలరీ యాడ్‌లో నటించారు. సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో తేజస్విని ఆభరణాలు ధరించి, రాక్ క్లైంబింగ్ చేయడం, అలాగే డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలలో కనిపించారు. మొదటిసారి అయినా కూడా, ఆమె చాలా సహజంగా, అద్భుతంగా నటించారని ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులు ఈ యాడ్‌ను విపరీతంగా షేర్ చేస్తూ, “నటన అనేది వాళ్ల ఇంట్లో, రక్తంలోనే ఉంటుంది కదా” అని కామెంట్లు పెడుతున్నారు.





 



