Avatar : అవతార్‌.. ఫైర్‌ అండ్‌ యాష్ – మూవీ రివ్యూ

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్ - మూవీ రివ్యూ

ప్రపంచ సినీ ప్రేక్షకులను అబ్బురపరిచిన చిత్రాల్లో ‘అవతార్‌’ (Avatar)ది ప్రత్యేక స్థానం. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) సృష్టించిన ఈ విజువల్‌ వండర్‌ 2009లో విడుదలై అప్పటి వరకు ఉన్న అన్ని బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. వెండితెరపై ప్రేక్షకులు ఎప్పుడూ చూడని స్థాయి విజువల్స్‌తో పండోరా (Pandora) అనే సరికొత్త లోకాన్ని పరిచయం చేసి సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం రాశాడు కామెరూన్‌. అప్పుడే అవతార్‌కు నాలుగు సీక్వెల్స్‌ ఉంటాయని ప్రకటించిన ఆయన, 2022లో ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar: The Way of Water)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కథ పరంగా కొంత విమర్శలు ఎదురైనా, విజువల్‌ గ్రాండియర్‌తో భారీ వసూళ్లు సాధించింది. ఇక తాజాగా మూడో భాగంగా వచ్చిన ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar: Fire and Ash) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? లేదో ఇప్పుడు చూద్దాం.

కథ ఏమిటంటే…
పెద్ద కొడుకు నితాయాం మరణంతో జేక్‌ సల్లీ (సామ్‌ వర్తింగ్టన్‌), నేతిరి (జో సల్డానా) తీవ్ర విషాదంలో మునిగిపోతారు. అయినా మిగిలిన పిల్లలు లోక్‌, టూక్‌, కిరి, అలాగే దత్తపుత్రుడు స్పైడర్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగుతారు. తమ కుమారుడి మరణానికి కారణమైన మానవ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు.

ఇదే సమయంలో అవతార్‌ 2లో మరణించిన కల్నల్‌ క్వారిచ్‌ (స్టీఫెన్‌ లాంగ్‌) మరో రూపంలో తిరిగి వస్తాడు. అతనికి అగ్నితెగకు చెందిన నాయకురాలు వరంగ్‌ (ఊనా చాప్లిన్‌) మద్దతుగా నిలుస్తుంది. జేక్‌ సల్లీ కుటుంబం ఆరాధించే ఈవా దేవతపై వరంగ్‌కు తీవ్ర వ్యతిరేకత ఉండటంతో, ఆమె క్వారిచ్‌తో చేతులు కలుపుతుంది. మరోవైపు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఆర్డీఏ బృందం కూడా రంగంలోకి దిగుతుంది. ఈ మూడు శక్తివంతమైన శత్రువుల నుంచి జేక్‌ సల్లీ తన కుటుంబాన్ని, తన తెగను ఎలా కాపాడుకున్నాడన్నదే ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ కథ.

సినిమా ఎలా ఉందంటే…
జేమ్స్‌ కామెరూన్‌ అంటే విజువల్స్‌ అనే మాటకు ఈ సినిమాతో మరోసారి అర్థం చెబుతాడు. మొదటి భాగంలో పండోరా అరణ్యాలను, రెండో భాగంలో సముద్ర లోకాన్ని చూపించిన ఆయన, ఈసారి అగ్ని తెగతో కూడిన కొత్త వాతావరణాన్ని పరిచయం చేశాడు. అయితే కథ, కథన పరంగా మాత్రం కొత్తదనం పెద్దగా కనిపించదు. అవతార్‌ 2లో ఎదురైన అదే సమస్యలు మూడో భాగంలోనూ కొనసాగుతాయి.

విజువల్స్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ, ‘వావ్‌’ అనిపించే స్థాయి మాత్రం కొంత తగ్గింది. ముందే చూసిన సన్నివేశాలే మరోసారి ఎదురవడంతో సినిమా కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. దాదాపు 3 గంటల 17 నిమిషాల నిడివి ఉండటంతో ఫస్ట్‌ హాఫ్‌ సాగదీతగా మారుతుంది. కథ ముందుకు కదలకుండా అక్కడక్కడే తిరుగుతుండటంతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.

అయితే సెకండాఫ్‌లో మాత్రం సినిమా కొంత వేగం పెంచుతుంది. వరంగ్‌, కిరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. స్పైడర్‌ పాత్రకు సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. నేతిరి జేక్‌ సల్లీని విడిపించేందుకు చేసే ప్రయత్నాలు, వాటిలో వచ్చే పోరాటాలు బాగున్నాయి. క్లైమాక్స్‌ విజువల్స్‌ పరంగా ఆకట్టుకున్నా, అవతార్‌ 2 చివరి సన్నివేశాలను గుర్తు చేస్తుంది. మొత్తంగా కథ పరంగా ఇది సాధారణంగానే అనిపించినా, టెక్నికల్‌ అంశాల్లో మాత్రం సినిమా అద్భుతంగా నిలుస్తుంది.

నటీనటులు & సాంకేతిక అంశాలు
జేక్‌ సల్లీగా సామ్‌ వర్తింగ్టన్‌ మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఓ నాయకుడిగా, తండ్రిగా అతని నటన సహజంగా ఉంటుంది. నేతిరిగా జో సల్డానా ఈ భాగంలో మరింత శక్తివంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో ఆమె అదరగొట్టింది. ఈ చిత్రానికి కొత్త శక్తిగా నిలిచిన పాత్ర వరంగ్‌. ఆ పాత్రలో ఊనా చాప్లిన్‌ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె తెరపై కనిపించిన ప్రతిసారి ఓ ప్రత్యేక ప్రభావం కనిపిస్తుంది.

సిగౌర్నీ వీవర్‌, బ్రిటన్‌ డాల్టన్‌ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. రస్సెల్‌ కార్పెంటర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్‌లా ఉంటుంది. సైమన్‌ ఫ్రాంగ్లెన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో మాత్రం మరింత కత్తిరింపు అవసరం అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు తొలగించి ఉంటే సినిమా మరింత బిగువుగా ఉండేది. నిర్మాణ విలువలు హాలీవుడ్‌ స్థాయికి తగ్గట్టే అద్భుతంగా ఉన్నాయి.

చివ‌రి మాటలు
‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ కథ పరంగా పెద్ద ఆశలు పెట్టుకునే సినిమా కాదు. కానీ విజువల్స్‌, వీఎఫ్ఎక్స్‌, టెక్నికల్‌ గ్రాండియర్‌ కోసమే అయినా ఈ సినిమాను పెద్ద తెరపై ఒక్కసారి చూడవచ్చు. జేమ్స్‌ కామెరూన్‌ మ్యాజిక్‌ కథలో కంటే తెరపై కనిపించే ప్రపంచంలోనే ఎక్కువగా పనిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment