ప్రస్తుతం భారతదేశం (India)లో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా మహిళల జట్టు (Women’s ODI World Cup) చరిత్ర సృష్టించింది. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియాపై మరోసారి ఆస్ట్రేలియా (Australia)ఘన విజయం సాధించింది. కెప్టెన్ అలిస్సా హీలీ (142 పరుగులు, 107 బంతుల్లో) మెరుపు సెంచరీతో అదరగొట్టగా, ఆస్ట్రేలియా 331 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇది మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ రికార్డు. అంతకుముందు 2024లో దక్షిణాఫ్రికా (South Africa)పై శ్రీలంక (Sri Lanka) మహిళలు 302 పరుగులు ఛేదించడమే అతిపెద్ద రికార్డుగా ఉండేది.
అంతేకాకుండా, అత్యధిక రన్ ఛేజింగ్ రికార్డుల్లో టాప్ 5లో ఏకంగా నాలుగు రికార్డులు ఆస్ట్రేలియా పేరిటే ఉండటం విశేషం. 2012లో 289, 2023లో 283, 2025లో 282 పరుగులను కూడా ఆసీస్ ఛేదించింది. ఈ అద్భుతమైన విజయం ప్రపంచకప్ చరిత్రలోనూ అతిపెద్ద ఛేజ్‌గా నమోదైంది. గతంలో 2022 ప్రపంచకప్‌లో ఆక్లాండ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఛేదించిన 278 పరుగుల రికార్డును ఇదే జట్టు బద్దలు కొట్టింది. ఈ విజయంతో, ఆస్ట్రేలియా 2025 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అపజయం లేకుండా తమ మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. నాలుగు మ్యాచ్‌లలో 4 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, వరుస ఓటముల కారణంగా నెట్ రన్‌రేట్ గణనీయంగా పడిపోయింది. దీంతో తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు అత్యవసరం.








