టీటీడీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందగా, నిన్న బైక్‌పై ఇంటికి వెళ్తున్న టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి చేసింది. నేడు తాజాగా జరిగిన ఘటన భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
బంగారు బిస్కెట్ చోరీకి యత్నం..
తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో తస్కరించిన బంగారం బిస్కెట్‌ను దాచి ఉంచాడు బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య. గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు స్పందించారు. హుండీని తరలించే సమయంలో ఉద్యోగి బంగారం బిస్కెట్‌ను దొంగలించేందుకు యత్నించాడని, శ్రీవారి పరకామణి విజిలెన్స్ నిఘాలో ఉంటుందని చెప్పారు. ప్రతిసారి హుండీలను రెండుసార్లు తనిఖీలు చేస్తామన్నారు. తనిఖీల్లో బంగారు బిస్కెట్ బయట పడిందని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు.
మొన్న టోకెన్ల కోసం భక్తుల తొక్కిసలాట, నిన్న టీటీడీ ఉద్యోగిపై చిరుత మెరుపు దాడి, నేడు పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ యత్నం.. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటుండడంతో భద్రతా చర్యలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.