గణతంత్ర దినోత్సవం రోజున ఆరేళ్ల చిన్నారుపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బానాయుడు వివరించారు. చిలకలూరిపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంటిపట్టునే ఉంటూ తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఇది గమనించిన పాలపర్తి గోవింద్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు.
ఇంట్లోకి వెళ్లిన బాలిక ఎంతకూ బయటకు రాకపోవడంతో స్నేహితులు ఇంట్లోకి వెళ్లి చూడగా గోవింద్ అనే యువకుడు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తున్నాడు. దీంతో వారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా వారంతా వచ్చి గోవింద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇటీవల విపరీతం..
ఇటీవల కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతమయ్యాయి. మహిళా రక్షణపై ప్రతిపక్ష వైసీపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నెలరోజుల్లో మహిళలు, చిన్నారులపై జరిగిన లైంగిక దాడులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇటీవల చేసిన ట్వీట్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మరి రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.