ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయడంతో ఆమె మండిపడ్డారు. దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి. అతిశీ మీడియాతో మాట్లాడతూ.. తమ నివాసాన్ని రద్దు చేయాలన్న నోటీసులు సోమవారం కూడా వచ్చాయని వెల్లడించారు.
తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ కార్యకర్తలు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కానీ, తాను ఢిల్లీ ప్రజల కోసం పని చేయడం ఆపలేనని, అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటానని అతిశీ స్పష్టం చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 85 ఏళ్ల పైబడ్డ వారికి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతున్నాయి.