ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. “అధికారం మాది, మా వారే వ్యాపారాలు చేయాలి, మా మనుషులే పదవుల్లో ఉండాలి” అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించడం, దాడులు చేయడం, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి ఆస్తులు రాయించుకోవడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆర్యవైశ్యులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది పోలీసుల అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిడుగురాళ్లలో ఆర్యవైశ్య మహిళపై..
ఈ వేధింపుల పరాకాష్టగా పిడుగురాళ్లలో ఓ ఆర్యవైశ్య మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కోడూరి జ్యోతి, తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఆరోపిస్తూ, అదే స్టేషన్లో చేతి మణికట్టు నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. టీడీపీ నేతలు, స్థానిక సీఐ కలిసి తన భర్తను వేధించారని, తానూ అర్ధరాత్రులు స్టేషన్‌కు పిలిపించి అసభ్య పదజాలంతో దూషించారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది.
పల్నాడులో దారుణం
— Telugu Feed (@Telugufeedsite) December 28, 2025
సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యయత్నం
పల్నాడుకు చెందిన ధాన్యం వ్యాపారి (ఆర్యవైశ్య) భార్య కోడూరి జ్యోతిని బెదిరించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి సెల్లో వేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు
తరచూ సిఐ వేధిస్తున్నాడని కత్తితో పోలీస్ స్టేషన్ లోనే చెయ్యి… pic.twitter.com/O7SvJ2R9Xj
ప్రకాశం జిల్లా పొదిలిలో తండ్రీకొడుకులపై..
ఇదే తరహాలో ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్య వ్యాపారులపై పోలీసుల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. ఎరువుల వ్యాపారం చేసే యాదాల కోటేశ్వరరావు, ఆయన కుమారుడు అవినాష్‌పై స్థానిక ఎస్సై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. లారీ నిలిపిన విషయాన్ని ప్రశ్నించడమే నేరంగా మార్చి, అవినాష్‌ను మూడు రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఈ దాడులను ప్రశ్నించిన తండ్రినీ కొట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
దర్శిలో ఆర్యవైశ్య రేషన్ డీలర్‌పై..
దర్శి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతల బరితెగింపు బయటపడింది. దొనకొండ మండలానికి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను రేషన్ డీలర్ పదవికి రాజీనామా చేయాలంటూ వేధింపులకు గురిచేశారు. రాజీనామా చేయకపోవడంతో కిడ్నాప్‌కు కూడా ప్రయత్నించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అదే సమయంలో అతనిపైనే తప్పుడు కేసులు నమోదు చేయించి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
విజయవాడలో ఆర్యవైశ్యులపై బెదిరింపులు..
విజయవాడలో వ్యాపార, వాణిజ్య సంఘాలపై కూడా కూటమి నేతల ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్యవైశ్యులు కీలక పదవుల్లో ఉన్న సంఘాల పాలకవర్గాలను రాజీనామా చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సంఘాలు తమ చేతుల్లో ఉంటే ఆర్థిక వనరులు లభిస్తాయన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీ ఆర్యవైశ్య మహాసభ పెద్దలపై కూడా రాజీనామాల కోసం బెదిరింపులు జరుగుతున్నాయని సమాచారం.
మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ విధమైన దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు. తమ వ్యాపారాలు, పదవులు, ఆస్తులు లక్ష్యంగా మారుతున్నాయని, ప్రభుత్వమే జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.







