ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపు డైలమాలో పడింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత ఉచిత చికిత్స పథకానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఏపీఎస్‌హెచ్ఏ) ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తీవ్ర ఆవేదనతో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది.
పెండింగ్ బిల్లులు రూ. 3,000 కోట్లలో కనీసం రూ. 2,000 కోట్లను వెంటనే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బిల్లులు చెల్లించకపోతే, జనవరి 6 నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ చర్య ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మందులు, పరికరాల సరఫరా చేసేవారికి డబ్బులు చెల్లించలేకపోతున్నామని, ఆస్పత్రుల సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడు నెలలుగా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో కూడా పెండింగ్ బిల్లుల సమస్యకు సరైన పరిష్కారం దొరకలేదని తెలిపారు.
రూ. 2 వేల కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. మిగిలిన బిల్లుల చెల్లింపుకు నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని పేర్కొంది. పెన్షన్‌లు, జీతాలతోపాటు ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును క్రమబద్ధంగా చేయాలని కోరింది. ఆస్పత్రులు సేవల్ని నిలిపివేస్తే, పథకం కింద చికిత్స పొందే పేద ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రభావం కలిగే అవకాశం ఉంది.