తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడంటూ ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన మహిళా ప్రభుత్వ ఉద్యోగినిపైనే పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. న్యాయం కోసం ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలిపైనే ఎక్స్‌టార్షన్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో ఫిర్యాదు చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
బాధితురాలిపై ఎక్స్‌టార్షన్ కేసు
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీడియాకు వీడియోలు విడుదల చేసిన మహిళ వీణపై ఎక్స్‌టార్షన్ (వసూళ్లు, బ్లాక్‌మెయిల్) కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే ఈ కేసు పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యేపై మాత్రం కేసే లేదు
అయితే, బాధితురాలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మహిళ నుంచి కేవలం ఆన్‌లైన్ పిటిషన్ మాత్రమే అందిందని, అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆమె ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం కోసం ముందుకొస్తే కేసులు పెట్టి భయపెడుతున్నారంటూ ఈ వ్యవహారంపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
న్యాయం ఎవరికీ?
ఇటీవల మంత్రి సంధ్యారాణి పీఏపై వచ్చిన ఆరోపణల కేసులోనూ బాధితురాలినే నిందితురాలిగా మార్చి జైలుకు పంపిన ఉదంతం గుర్తుకు తెస్తోంది. ఇప్పుడు మరోసారి అదే తరహా పరిస్థితి తలెత్తిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే బాధితులనే నేరస్తులుగా మలుస్తున్నారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర విచారణ జరపాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బాధితురాలిపై దుష్ప్రచారం
మరోవైపు ఎమ్మెల్యే వర్గం సోషల్ మీడియాలో బాధిత మహిళపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఎమ్మెల్యే నిర్దోషి అని ప్రచారం చేస్తూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో కాల్స్‌లో ఎమ్మెల్యే స్పష్టంగా కనిపించినప్పటికీ, తప్పేమీ జరగలేదని ఆయన వర్గం బుకాయిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్
ఈ వ్యవహారం తీవ్రతరంగా మారడంతో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఎవరికీ అందుబాటులోకి లేకుండా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరోపణలపై ఒక వీడియో విడుదల చేసిన అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయవాదుల సలహా తీసుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం విచారణకు హాజరయ్యేలా జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.








