ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. అంతేకాకుండా మెడికల్ కాలేజీల (Medical College) నిర్మాణంపై టీడీపీ – వైసీపీ (TDP – YSRCP) మధ్య జరుగుతున్న వివాదానికి సైతం తెరపడింది. వైసీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి కాలేదని కూటమి పార్టీ చేస్తున్న ప్రచారానికి నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) బ్రేక్స్ వేసి అదంతా అబద్ధమని తేల్చింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంలో స్థాపించబడిన కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) పీజీ సీట్లను (PG Seats) మంజూరు చేసింది. మొత్తం 5 మెడికల్ కాలేజీలకు 60 పీజీ సీట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వైద్య విద్య రంగంలో కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి.
మచిలీపట్నం (Machilipatnam) మెడికల్ కాలేజీ (Medical College)కి 12, నంద్యాలకి 16, విజయనగరానికి 12, రాజమండ్రికి 16, ఏలూరుకు 4 పీజీ సీట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో కొత్తగా ఏర్పాటైన కాలేజీల్లో పీజీ స్థాయి వైద్య విద్యకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ ఐదు కాలేజీలకు ఒక్కొక్కటికి 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) మంజూరు చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని, అవి కేవలం పేపర్ పై మాత్రమే ఉన్నాయనే దుష్ప్రచారాన్ని NMC తాజా నిర్ణయంతో పూర్తిగా ఖండించింది. 60 పీజీ సీట్ల మంజూరుతో జగన్ ప్రభుత్వం వైద్య విద్య విస్తరణలో తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలవుతున్నాయని నిరూపితమైంది. ఈ సీట్ల మంజూరు రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను, విద్యార్థులకు ఉన్న అవకాశాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








