ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విలువైన భూములు కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా బదలాయించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ భూమి బదలాయింపును సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన నక్క నమ్మి గ్రేస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించింది.
విశాఖపట్నం సర్వే నంబర్ 70/1 & 70/2లో ఉన్న సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆమోద్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (రాధాకృష్ణ సంస్థ) కార్యాలయం నిర్మాణం కోసం ఉచితంగా కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 492 (తేదీ: 12-12-2025) ద్వారా భూమిని తక్షణమే బదలాయించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. జీవో ఎంఎస్ నెంబర్ 571 (14-09-2012)లోని క్లాజ్–3 ప్రకారం ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ప్రభుత్వ భూములు బదలాయించడానికి అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూములు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట విరుద్ధమని జడ శ్రవణ్ కుమార్ కోర్టులో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న భూ బదలాయింపు చట్టాలు, విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన వాదించారు.
ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవోలను అనుసరించి ఇప్పటికే ఏమైనా సేల్ డీడ్ రాసారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే, ఏ చట్టం ఆధారంగా ప్రభుత్వం ఉచితంగా భూమి బదలాయించిందో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ జీవో ఏ సందర్భంలో జారీ అయిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు, పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం (అఫిడవిట్) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భూ బదలాయింపులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసిన ధర్మాసనం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.








