రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన దంపతులకు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే ఆన్‌లైన్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో ఉండి, వాటిపై క్యూఆర్ కోడ్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని, కొత్త కార్డుల కోసం 70,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ దరఖాస్తులను పరిశీలించి జారీ చేస్తే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.50 కోట్లను చేరుకోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వం జారీ చేసిన కార్డు నమూనాను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త కార్డులు క్రెడిట్ కార్డ్‌లను పోలి ఉంటాయని, వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్డును స్కాన్ చేయగా, సంబంధిత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు కనిపిస్తాయని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియను జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ, కొత్త పెళ్లైన దంపతులు, కుటుంబ సభ్యుల పేర్ల మార్పులకు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యలన్నింటికి కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టింది.
తెలంగాణలోనూ కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు పూర్తయ్యాయి. కొత్తగా క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోనూ క్యూఆర్ కోడ్‌తో జారీ చేయనున్నట్లు సమాచారం.