ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు వరుసగా వస్తున్న బెదిరింపు లేఖలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తొలుత జనసేనకు చెందిన ఓ మంత్రితో ప్రారంభమైన ఈ బెదిరింపులు, క్రమంగా కూటమిలోని ఇతర పార్టీల మంత్రుల వరకూ విస్తరించాయన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలను టీడీపీ అనుకూల మీడియా ధ్రువీకరించింది. జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు మంత్రులకు బెదిరింపు లేఖలు అందినట్లు సమాచారం.
జనసేన ఎమ్మెల్యే, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. మావోయిస్టుల పేరుతో రాసిన ఈ లేఖను సచివాలయంలోని దుర్గేష్ ఛాంబర్‌కు పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఆయన కార్యాలయ సిబ్బంది తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేవలం కందుల దుర్గేష్ మాత్రమే కాకుండా, మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్‌లకు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేసిన ఈ లేఖలు, రాష్ట్రంలో భద్రతా అంశాలపై చర్చకు దారితీశాయి. ఇప్పటికే కొందరు మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నాది చిన్న శాఖ.. నేను ఏ తప్పు చేయలేదు : కందుల దుర్గేష్
ఈ వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖ కారణంగా తన కుటుంబం ఆందోళనకు గురైందని ఆయన తెలిపారు. తాను నిర్వహిస్తున్నది చిన్న శాఖేనని, మావోయిస్టులు లేఖ రాయాల్సినంతగా తాను వ్యక్తిగతంగా గానీ, శాఖాపరంగా గానీ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే ఉద్దేశంతో ఇలాంటి లేఖలు రాస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
బెదిరింపు లేఖల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి నిజంగా మావోయిస్టుల చర్యలేనా, లేక కావాలనే రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నమా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వరుసగా మంత్రులకు వస్తున్న ఈ బెదిరింపులు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.








