టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ (Industry)లో సినీ కార్మికులు (Cinema Workers) వర్సెస్ నిర్మాతల (Producers) వివాదం తీవ్రరూపం దాల్చింది. నిర్మాతలు ఒకమెట్టు కిందకు దిగివచ్చినా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీ.జీ.విశ్వప్రసాద్ (T.G. Vishwaprasad) పంపించిన లీగల్ నోటీసులపై (Legal Notices) కార్మిక ఫెడరేషన్ నాయకుల్లో కోపం ఇంకా తగ్గినట్టుగా లేదు. అందుకే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ తమ డిమాండ్ల విషయంలో తలొగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ (AP Cinematography) మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనపై నిర్మాతలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి నిర్మాతలు వచ్చారని, వారిని తాము ఆహ్వానించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురి వాదనలు వింటామని చెప్పారు. అనంతరం ఈ అంశాన్ని సీఎం(CM), డిప్యూటీ సీఎం(Deputy CM)ల దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు.
ప్రభుత్వ జోక్యం అవసరమైతే, సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారానికి ఫెడరేషన్, ఛాంబర్ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తే, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.