నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నేడు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో దాదాపు 35కు పైగా కీలక అంశాలను అజెండాలో చేర్చిన‌ట్లుగా స‌మాచారం.

పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AP Logistics Infrastructure Corporation) ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అమలుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు 500 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. మరోవైపు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చ జరగనుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో కీలక చర్చ జరగనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపర్చే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కింద రూ.5 వేల కోట్ల రుణం తీసుకునే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా ఈ కేబినెట్‌లో ఉండనున్నాయి. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, పాఠశాల విద్యార్థులకు కిట్‌ల పంపిణీ కోసం రూ.944.53 కోట్ల పరిపాలన అనుమతులపై చర్చ జరగనుంది. అదేవిధంగా సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

ఇవే కాకుండా సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలకు ఆమోదం, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలు కూడా నేటి కేబినెట్ అజెండాలో ఉన్నాయి. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రభావం చూపనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment