బ్యూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్.. కూట‌మి కేసులే ఎజెండా?

బ్యూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్.. కూట‌మి కేసులే ఎజెండా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై వేధింపులు తారస్థాయికి చేరుకోవడంపై బ్యూరోక్రాట్లలో అలజడి మొదలైంది. వరుస కేసులతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కూటమి ప్రభుత్వ తీరుపై ఆఫీసర్లలో అంతర్మథనం మొదలైంది. ఇప్పుడు వారి వంతు అయితే, రేపు మనవంతు రావచ్చన్న ఆందోళన వారిని వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏపీకి చెందినక సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి సమాచారం లేకుండా రహస్యంగా సమావేశమై వరుస ఉదంతాలపై చర్చించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ IAS, IPS అధికారులు హైదరాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఇటీవల ఒక రహస్య సమావేశం నిర్వహించార‌ని, ఈ సమావేశం గురించి రాజకీయ, ఉన్నతాధికార వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యూరోక్రాట్లు, మాజీ అధికారులపై నమోదైన కేసులు, అరెస్టులు, బదిలీలు, పోస్టింగ్‌లపై అసంతృప్తి, రిటైర్డ్ అయిన అధికారులకు కీలక పోస్టుల కేటాయింపు వంటి అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతోందని..
సీఎం చంద్ర‌బాబును అరెస్టు చేసిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ట‌చ్ చేయాల‌ని ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంద‌నే చ‌ర్చ ఏపీలో విస్తృతంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన అధికారులపై వ‌రుసగా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని, ఇలా జ‌గ‌న్ చుట్టూ ఉన్న స‌న్నిహితుల‌ను ఏదో ఒక కేసులో ఇరికించిన త‌రువాత మాజీ ముఖ్య‌మంత్రిని ట‌చ్ చేస్తార‌నే చ‌ర్చ ఇప్ప‌టికే ప్ర‌తీ గ్రామంలోనూ జ‌రుగుతుంది. ఈ విషయం కూట‌మి ప్ర‌భుత్వం దృష్టికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చ‌ర్చ జ‌రుగుతుండ‌గా బ్రూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్ ఆస‌క్తిక‌రంగా మారింది.

చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ కీలక అంశాలివేన‌ట‌..
గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన కొందరు IAS, IPS అధికారులపై ఇటీవల కేసులు నమోదై, అరెస్టులు కూడా జరిగాయి. ముఖ్యంగా సీనియర్ IPS అధికారి పీ.ఎస్.ఆర్.ఆంజనేయులుపై నమోదైన కేసులు, అరెస్టు అధికారుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఈ అంశం సమావేశంలో ప్రధాన అంశంగా మారినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో రిటైర్డ్ IAS అధికారులకు కీలక పదవులు కేటాయించడంపై కొందరు సీనియర్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన‌ట్లుగా స‌మాచారం. బదిలీలు మరియు పోస్టింగ్‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన బదిలీలు, పోస్టింగ్‌లలో స్థానిక ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉందని, ఇది బ్యూరోక్రసీ స్వతంత్రతను దెబ్బతీస్తోందని మీటింగ్‌లో అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం. ఈ అంశంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు భోగ‌ట్టా.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కేసులు పెట్టడానికి అధికారులను పావుగా ఉపయోగిస్తోందని, భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పుడు తమపై దాని ప్రభావం ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశార‌ట‌. ఈ రాజకీయ ఒత్తిడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక సమష్టి నిర్ణయానికి రావాలని వారు తీర్మానించిన‌ట్లుగా తెలుస్తోంది.

రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌కూడ‌ద‌ని..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో వైరివ‌ర్గంపై కేసులు నమోదు చేస్తోందని, ఇది అధికారుల స్వతంత్రతను దెబ్బతీస్తోందని వారు భావిస్తున్నార‌ట‌. ముఖ్యంగా, సీనియర్ IPS అధికారి పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటా, జాషువా, పీవీ సునీల్‌కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి వంటి వారిపై నమోదైన కేసులు అధికారుల్లో భయాందోళనలను రేకెత్తించాయి. ప్రస్తుత ప్రభుత్వం వ‌రుస కేసులు ఉదంతం భవిష్యత్తులో తమపై రాజకీయ ప్రతీకార చర్యలకు దారితీస్తుందని అధికారుల్లో ఆందోళన మొద‌లైన‌ట్లుగా తెలుస్తోంది. అందుకే సీక్రెట్‌గా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అన్ని అంశాల‌పై కులంక‌షంగా చ‌ర్చించి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇప్ప‌టికే ఈ కేసులు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని, రాజకీయ ఆటలో పావులుగా మారకూడదని అధికారులు నిర్ణ‌యించుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇక‌పై ఎలాంటి రాజ‌కీయ ఒత్తిడిల‌కు లొంగ‌కూడ‌ద‌ని తీర్మానించుకున్నార‌ని తెలుస్తోంది.

లోకేశ్ తేలిగ్గా తీసుకున్నారా..?
ఈ సీక్రెట్ మీటింగ్ వ్యవహారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఈ విషయాన్ని మాట వ‌రుస‌కైనా స్వీక‌రించ‌లేద‌ని, బ్యూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్ వ్య‌వ‌హారాన్ని కొట్టిపారేశార‌ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నతాధికారుల మధ్య అసంతృప్తి, రాజకీయ ఒత్తిడిని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం ఫలితాలు రాష్ట్ర పరిపాలనలో భవిష్యత్ పరిణామాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment