తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో తన క్యూట్ లుక్స్‌తో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), పదేళ్ల నటనా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ తన ఉత్సాహం, నటనా పట్ల ఉన్న ప్యాషన్ ఏ మాత్రం తగ్గలేదని ఆమె తెలిపారు.
ప్రేక్షకుల ప్రేమ వల్లే తెలుగు నేర్చుకున్నా..
అనుపమ మాట్లాడుతూ, “తెలుగు(Telugu)లో నా ప్రయాణం మొదలై 10 ఏళ్లు పూర్తయ్యింది. కానీ ఇప్పటికీ నేను మొదటి సినిమా చేస్తున్నానేమో అన్నంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. కొత్త ఊరికి వచ్చి ఇంత గుర్తింపు పొందుతానని కలలో కూడా ఊహించలేదు. తెలుగు ప్రేక్షకుల అభిమానం, వారి మమకారం వల్లే నేను తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాను. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, నాపై ప్రేక్షకుల ప్రోత్సాహమే నాకు ప్రేరణగా నిలిచింది. ఇకపై నేను నచ్చిన కథల్నే ఎంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను” అని అన్నారు.
‘పరదా’ కథ చల్లటి గాలిలా అనిపించింది..
తన కొత్త సినిమా ‘పరదా’ (‘Parada’) గురించి కూడా అనుపమ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “మన దగ్గర మంచి కథల కొరత ఎక్కువ. కొన్ని కథలు విన్నా, ఒక్కసారిగా కొత్త అనుభూతిని ఇవ్వవు. కానీ ‘పరదా’ కథ విన్నప్పుడు, నా మొహానికి చల్లటి గాలి తాకినంత కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఈ సినిమాలో 70 శాతం సన్నివేశాల్లో నా ముఖాన్ని చూపకుండా నటించడం ఒక పెద్ద సవాలు. అయినప్పటికీ, నా శరీర భాష, కళ్ళు, గళం ద్వారా ప్రేక్షకులను కనెక్ట్ చేసుకోగలిగాను. ఈ కథలో చూపించిన అంశాలు ప్రతి మహిళ జీవితంలోనూ ఎదురయ్యే సమస్యలనే వివరిస్తాయి. ఈ సినిమా ఒక కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రం” అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.