ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మరొక హామీ అమలుకు శ్రీకారం చుట్టనుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా పథకం కొనసాగింపుగా దాని పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన కూటమి ప్రభుత్వం.. నేడు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7,000 చొప్పున నేరుగా నగదు జమ కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.5,000, కేంద్రం నుంచి అందే పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.2,342.92 కోట్లను విడుదల చేస్తోంది, కేంద్రం రూ.831.51 కోట్లు జమ చేయనుంది.
వైసీపీ విమర్శలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి.. ఏడాది జాప్యం చేసిందని, రైతులకు రూ.10,800 కోట్లు ఎగనామం పెట్టిందని వైసీపీ విమర్శిస్తోంది. అదే విధంగా వైఎస్ జగన్ పంటపెట్టుబడి సాయం ద్వారా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ది కలిగించగా, కూటమి ప్రభుత్వం 46.85 లక్షల కుటుంబాలకు మాత్రమే అర్హులుగా తేల్చిందని, 7 లక్షలకు పైగా కుటుంబాలకు ఈ పథకాన్ని దూరం చేసిందన వైసీపీ అంటోంది. ఈ ఏడాది రైతు భరోసా సాయం కోసం కూటమి ప్రభుత్వం కేవలం రూ.2,342 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించింది.