ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు రావడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
జగదీష్ పద్ధతులు
మంత్రి అనిత అండతో పీఏ జగదీష్ అక్రమ వసూళ్లలో పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల బదిలీలు, పోస్టింగుల వంటి సిఫార్సుల కోసం అక్రమంగా డబ్బుల వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలు కూడా జగదీష్ వ్యవహార శైలిని విమర్శిస్తూ, ఆయనపై ఫిర్యాదులు చేయడం గమనార్హం. అలాగే, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి వేయడం, ఉద్యోగుల బదిలీల్లో లక్షల వసూళ్లకు పాల్పడటం వంటివి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నట్లుగా సమాచారం.
తన పీఏ జగదీష్‌పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ హోంమంత్రి అనిత ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాలి.