అహ్మదాబాద్ (Ahmedabad)లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines) ప్రమాదం నుండి ప్రపంచం ఇంకా తేరుకోకముందే, మరో ఘటన కలకలం రేపింది. రష్యా (Russia)లో అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) విమానం గమ్యస్థానం చేరుకోకముందే కుప్పకూలిపోయింది. 40 మందితో బయలుదేరిన ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు కోల్పోయింది. దీంతో విమానం ఏమైందనే ఉత్కంఠ నెలకొంది. ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటన రష్యా నుండి చైనా సరిహద్దులోని అముర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి వెళ్తున్న సమయంలో చోటు చేసుకుంది. విమానం తన గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సంబంధాలు తెగిపోయింది. రెండు గంటల గాలింపు అనంతరం విమానం కుప్పకూలినట్లుగా నిర్ధారించారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 40 మంది (25 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది) మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
విమానంలో ఐదుగురు పిల్లల సహా మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రాంతీయ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు. విమాన శకలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది.