కొత్త హెలికాప్ట‌ర్ ముందే కొనేసి త‌ర్వాత క‌మిటీ!

కొత్త హెలికాప్ట‌ర్ ముందే కొనేసి త‌ర్వాత క‌మిటీ!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే నెల‌నెలా అప్పుల‌తో నెట్టుకొస్తున్న ప్ర‌భుత్వం.. ఏకంగా వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ ప్ర‌జాధ‌నంతో కొత్త హెలికాప్ట‌ర్ కొనుగోలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. హెలికాప్ట‌ర్‌ కొనుగోలు ప్ర‌క్రియ క‌మిటీ వెనుకున్న కీల‌క విష‌యం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో సహా ఇతర మంత్రుల సౌకర్యార్థం విలాసవంతమైన ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. చిప్సాన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ గతంలోనే ఇవ్వబడినట్లు సమాచారం. ఆగస్టులో ఈ హెలికాప్టర్ డెలివరీ కానుందని తెలుస్తోంది.

క‌మిటీ కంటితుడుపు కోసమేనా?
కాగా, హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ ముందస్తుగానే ఖరారైనప్పటికీ, ప్రభుత్వం కేవలం కంటితుడుపు కోసం ఒక కమిటీని నియమించిందన్న‌ విమర్శలు వస్తున్నాయి. ఈ కమిటీ నియామకం ప్రజలను మభ్యపెట్టేందుకు, కొనుగోలులో పారదర్శకత ఉన్నట్లు చూపించేందుకేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ఆదేశాల మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కొనుగోలు ప్రక్రియను దగ్గరుండి మ‌రీ విలాస‌వంత‌మైన హెలికాప్ట‌ర్ కొనుగోలు ప్ర‌క్రియ‌ను పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఈ విషయం ప్రజల్లో మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆర్థిక సంక్షోభంలో విలాసవంత ఖర్చు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేయడం పట్ల ప్రజలు, ప్రతిపక్షాలు కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పథకాలు నిధుల కొరతతో స్తంభించి ఉన్నాయి. ఇటువంటి సమయంలో, ముఖ్యమంత్రి, మంత్రుల లగ్జరీ ప్రయాణాల కోసం కోట్లాది రూపాయలు వృథా చేయడం సమర్థనీయం కాదని, సంప‌ద సృష్టించాల్సిన ముఖ్య‌మంత్రి.. రాష్ట్ర ఖ‌జానాకు గండికొట్టే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

హామీల అమలులో చిత్తశుద్ధి ఏది..?
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో హామీలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం, విలాసవంతమైన ప్రయాణ సౌకర్యాల కోసం మాత్రం అత్యుత్సాహం చూపుతోందని వారు మండిపడుతున్నారు. విలాస‌వంత‌మైన ప్ర‌యాణం కోసం ప్ర‌జాధ‌నంతో హెలికాప్ట‌ర్‌ను కొనుగోలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. రాష్ట్రం పేద‌రికంలో ఉంటే ముఖ్య‌మంత్రుల‌కు, మంత్రుల‌కు ప్ర‌త్యేక విమానాలు, హెలికాప్ట‌ర్ల‌లో ప్ర‌యాణాలు అవ‌స‌ర‌మా..? అని నిల‌దీస్తున్నారు. అదీ చాల‌ద‌న్న‌ట్లుగా ప్ర‌భుత్వం కొత్త హెలికాప్ట‌ర్ కొనుగోలు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రజల విమర్శలు, నెటిజన్ల సెటైర్లు
కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ, ఈ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. “రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, మంత్రుల లగ్జరీ ప్రయాణాల కోసం కోట్లు ఎలా ఖర్చు చేస్తోంది?” అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోట్లు ఖ‌ర్చు చేసి కొనుగోలు చేసిన హెలికాప్ట‌ర్ పార్కింగ్‌, మెయింటెన్స్‌కు నెలనెలా క‌రెంటు బిల్లుల రూపంలోనో, టోల్ ఫీజు రూపంలోనో, నిత్యవ‌స‌ర ధ‌ర‌ల హైక్‌తోనో మా జేబుల నుంచే పిండేస్తారా..? అని సెటైర్లు వేస్తున్నారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టింది. ప్రజా సంక్షేమానికి ప్ర‌యారిటీ ఇవ్వకుండా, లగ్జరీ ప్ర‌యాణాల వైపు మొగ్గు చూప‌డం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే, ఈ వివాదం మరింత రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment