ఏపీలో భారీ వర్షాలు.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

ఏపీలో భారీ వర్షాలు.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రానున్న వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉమ్మడి విశాఖ జిల్లా, ఉత్తరాంధ్రలో..
ఉమ్మడి విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ వంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రాత్రి నుంచి బుధ‌వారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతిలో..
అమరావతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల ప్ర‌భావంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించిన ఈ రుతుపవనాలు, అనుకున్న సమయానికంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో, కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మరింత తీవ్రతరం కానున్నాయి. ఈ ఆవర్తనం గంగా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా మీదుగా విస్తరించి, వర్షాలను మరింత పెంచుతోందని ఐఎండి అమరావతి కేంద్రం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment