ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా నిలిపే ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం (Udayagiri Constituency)లో చోటుచేసుకుంది. ఏకంగా పోలీసుల ముందే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కిడ్నాప్ (Kidnapping)కు గురికావడం సంచలనంగా మారింది. వింజమూరు మండలంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పోలీసుల సమక్షంలోనే వైసీపీ(YSRCP) ఎంపీటీసీ (MPTCs)లను కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) కాకర్ల వర్గీయులే (Kakarla Supporters) ఈ దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఎంపీపీ ఎన్నికల్లో (MPP Elections) ఓటు హక్కు వినియోగించుకునేందుకు కారులో వస్తున్న ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ అనుచరులు అడ్డగించిన టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు కాగా, మల్లికార్జున్ (Mallikarjun) అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేసి పోలీసుల ముందు నుంచే తీసుకెళ్లడం స్థానిక ప్రజలను షాక్‌కు గురిచేసింది. మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారని వైసీపీ నేతలు తెలిపారు.
వింజమూరు మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా, అందరూ వైసీపీ బీఫామ్‌తోనే ఎన్నికయ్యారు. అయితే టీడీపీ నేతలు రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులతో ఏడు మందిని తమవైపునకు తిప్పుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎంపీపీగా ఉన్న మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను పదవి నుంచి దింపేసి, నేడు నూతన ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ వైపు ఐదుగురు ఎంపీటీసీలు ఉన్నారు. వారు కొండారెడ్డి, వంశి, రత్నమ్మ, భవాని, మల్లికార్జున్. అలాగే మోహన్ రెడ్డి, రమణయ్య కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న అనుమానంతో వారిద్దరినీ పోలీసులు నిర్బంధించారు. మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డిని పోలీసులతో నిర్బంధించి కొట్టించారు. ఇండిపెండెంట్ రమణయ్య ను నిర్బంధించి బెదిరించి అనుకూలంగా ఓటు వేయించుకున్నారని వైసీపీ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు జులుం చూపారని, పోలీసుల సమక్షంలోనే దాడులు, కిడ్నాప్‌లు జరిగాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, బలవంతపు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.








