న్యూఇయర్ (New Year) సందర్భంగా మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎక్సైజ్ శాఖ (Excise Department) గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక అనుమతుల ప్రకారం డిసెంబర్ 31 మరియు జనవరి 1 రాత్రుల్లో A4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది అమలు చేసిన విధానాన్నే ఈ ఏడాదీ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేవిధంగా 2B బార్లు, C1 (ఇన్–హౌస్), EP1 (ఈవెంట్ పర్మిట్), TD1 (ఇన్–హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సర్వీస్‌కు అనుమతి ఇచ్చారు. పర్యాటక కేంద్రాలు, హోటళ్లలో నూతన సంవత్సరం వేడుకలు సజావుగా జరిగేలా ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ సమయంలో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల అమలును పర్యవేక్షించేందుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.








