ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో కడప జిల్లాకు చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి తన ప్రతిభతో ఒక మైలురాయిని చేరుకుంది. కడప జిల్లా, ఎర్రమల్లె అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి, ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల ప్రపంచకప్‌లో ఆడిన మొట్టమొదటి క్రికెటర్ గా ఆమె రికార్డు సృష్టించింది.
చిన్నప్పుడు బ్యాడ్మింటన్, కబడ్డీలపై ఆసక్తి చూపిన శ్రీ చరణి, 16 ఏళ్ల వయస్సులో క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసే ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, మొదట్లో వ్యతిరేకించినా, ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో శ్రీ చరణి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ అప్పులు ఆమె కలపై ప్రభావం చూపకుండా తల్లిదండ్రులు సహకరించారు.
శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందినా, వికెట్లు లభించకపోవడంతో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్‌ను ఎంచుకుంది. ఈ మార్పు ఆమె కెరీర్‌కు బాగా కలిసివచ్చింది. కడప లాంటి ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఆమె పట్టుదల, నిరంతర కృషి ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికైంది. మహిళల ప్రపంచ కప్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో, భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా శ్రీ చరణి నిలిచి, దేశ గౌరవాన్ని పెంచింది.








