అనకాపల్లి (Anakapalli) జిల్లాను టీడీపీ (TDP) కూటమి నేతలు (Alliance Leaders) కల్తీ మద్యానికి అడ్డాగా మార్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 2న పరవాడ (Parawada)లో జరిగిన ఒక సంఘటన దీనికి బలం చేకూర్చుతోంది. ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం స్థావరంపై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, వారి నుంచి 72 లీటర్ల స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రులలో ఉపయోగించే స్పిరిట్‌ను హైదరాబాద్ (Hyderabad) నుంచి తీసుకొచ్చి పరవాడ కేంద్రంగా కల్తీ మద్యం (Fake Liquor) తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కీలక నిందితుడిగా టీడీపీ నేత రుత్తల రాము
అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులలో టీడీపీ నేత (TDP Leader) రుత్తల రాము (Ruththala Ramu) కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గం, మాకవరపాలెంకు చెందిన రాము స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఇటీవల జరిగిన ప్రభుత్వ పాఠశాల పేరెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో రుత్తల రాము చైర్మన్‌గా గెలిచారు. గ్రామంలో ఆయన టీడీపీ తరఫున చురుకుగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
మరో నిందితుడు పరవాడకు చెందిన యలమంచిలి (Yelamanchili) వెంకటేశ్వరరావు (Venkateswara Rao) అలియాస్ వెంకటేష్‌తో కలిసి రాము (Ramu) నకిలీ మద్యం తయారు చేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు మొదట గ్రామంలో ఒక హోటల్ నిర్వహించేవారని, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కల్తీ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడితో రాము ఫోటో వైరల్
ఈ కల్తీ మద్యం కేసులో పట్టుబడిన నిందితుడు రుత్తల రాము టీడీపీ కండువాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాము అయ్యన్నపాత్రుడికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని సమాచారం. ఈ కల్తీ మద్యం వ్యాపారం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.







