బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్య (Ayodhya)లో భారీ పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో భూములు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తూ ఆయన రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంలో సంచలనంగా మారారు. ఇప్పటికే అనేక ఆస్తులను సొంతం చేసుకున్న అమితాబ్, తాజాగా 40 కోట్ల రూపాయల విలువైన 25,000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు.
అయోధ్యలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. పలువురు ప్రముఖులు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తూ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్య రియల్ ఎస్టేట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. సరయూ నది సమీపంలోని అత్యంత విలువైన ప్రీమియం ల్యాండ్‌లో ఈ 25,000 చదరపు అడుగుల స్థలాన్ని సొంతం చేసుకోవడం ఆయన ఇటీవలి కొనుగోలులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రామమందిరం (Ram Mandir) పునఃప్రారంభానికి ముందు అమితాబ్ పేరిట 4.5 కోట్ల రూపాయలతో 5,300 చదరపు అడుగుల ప్లాట్ రిజిస్టర్ (Plot Registered) అయింది. అంతేకాక, ఆయన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ (Harivansh Rai Bachchan) పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ కింద 54,000 చదరపు అడుగుల మరో స్థలం కూడా ఉంది. ఈ స్థలంలో తన తండ్రి స్మారకంగా ఒక గొప్ప మెమోరియల్ నిర్మించాలని అమితాబ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయోధ్యతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆస్తుల కొనుగోలుతో ఆయన దృష్టిని ఆకర్షిస్తున్నారు.
2023లో అమితాబ్, తన కుమారుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో కలిసి 25 కోట్ల రూపాయల విలువైన 10 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. అమితాబ్ సతీమణి జయా బచ్చన్ (Jaya Bachchan) గత ఏడాది రాజ్యసభ (Rajya Sabha)లో ఆస్తుల వివరాలను వెల్లడించడంతో ఈ ఆస్తుల సమాచారం బహిర్గతమైంది. రామమందిరం పునర్నిర్మాణం తర్వాత అయోధ్య లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కేంద్ర బిందువుగా మారింది. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభదాయకంగా మారి, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి.