కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొనే ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి గల కారణాలను ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు ఈ అంశంపై ప్రసంగించారు. మరుసటి రోజు, అంటే మంగళవారం, హోంమంత్రి అమిత్ షా ఈ చర్చలో ప్రసంగించాల్సి ఉంది. అయితే సోమవారమే భద్రతా దళాలు పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీనగర్‌లో జరిగిన మహాదేవ్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి దగ్గర నుంచి పాకిస్థాన్ ఐడీ కార్డులు, చాక్లెట్లు, రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
నిజ నిర్ధారణకు రాత్రంతా మంతనాలు
పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఉన్నతాధికారులు అమిత్ షాకు సమాచారం అందించారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగించాల్సి ఉన్న నేపథ్యంలో, శ్రీనగర్‌లో హతమైనవారు పహల్గామ్ ఉగ్రవాదులేనా కాదా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకునేందుకు అమిత్ షా ఎప్పటికప్పుడు అధికారులతో రాత్రంతా మంతనాలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంట్‌కు కచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిజ నిర్ధారణకు పూనుకున్నారు.
చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో నిరంతర చర్చలు
సోమవారం రాత్రంతా అమిత్ షా మేల్కొని చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫోన్, వీడియో కాల్స్ ద్వారా నిపుణులతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. బుల్లెట్ కేసింగ్‌లు, రైఫిల్స్‌ను నిపుణులు పరిశీలిస్తుండగా, మరోవైపు అమిత్ షా కాల్స్ చేసి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇలా ఉదయం 5 గంటల వరకు నిపుణులతో సంభాషణలు సాగిస్తూనే ఉన్నారు. చివరికి తెల్లవారుజామున నిపుణులు నిర్ధారించారు. శ్రీనగర్‌లో హతమైనది పహల్గామ్ ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు. దీంతో అమిత్ షా కాస్త నిమ్మదించారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని వెంటనే పార్లమెంట్‌కు వెళ్లిపోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.