గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా భారీగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అంబటి రాంబాబును అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో ఆయనను తీసుకెళ్తున్న వాహనంపై దాడికి యత్నం జరిగింది. కొందరు టీడీపీ ఆందోళనకారులు వాహనంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ గందరగోళంలో అంబటి నివాసం వద్ద తోపులాట జరగగా పలువురు గాయపడినట్లు సమాచారం.
అంబటి అరెస్ట్ అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లరి మూకలు అంబటి రాంబాబు ఇంటిపై దాడికి దిగాయి. తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో అంబటి నివాసానికి నిప్పు పెట్టడంతో గుంటూరు ఒక్కసారిగా భయానక పరిస్థితిని ఎదుర్కొంది. “భయం రావాలి.. తీయండిరా” అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోతూ దాడులు చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంటికి నిప్పు పెట్టిన అనంతరం అంబటి రాంబాబు కారును తగలబెట్టారు.
సాయంత్రం అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రీ ప్లాన్డ్‌గా పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే అంబటిపై టీడీపీ శ్రేణులు హత్యాయత్నం చేశారని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సీఎంను దూషించారన్న కారణంతో ఒకవైపు అరెస్ట్, మరోవైపు ఇంటిపై దాడులు, నిప్పుపెట్టడం వంటి ఘటనలు రాష్ట్రంలో రాజకీయ హింస ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా చూపిస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
అంబటి అరెస్ట్ అనంతరం ఆయన ఇంటికి నిప్పు పెట్టిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు, అరాచకాలు అనుమతించరాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలాన్ని రేపుతోంది.








