బన్నీని టార్గెట్ చేశారా..? దుష్ప్రచారం వెనకుంది ఎవరు..?

బన్నీని టార్గెట్ చేశారా..? దుష్ప్రచారం వెనకుంది ఎవరు..?

త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్టైల్, డ్యాన్స్, నటన… ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘గంగోత్రి’తో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన‌ బన్నీ, తొలి రోజుల్లో ఎదురైన విమర్శలను ఎదుర్కొంటూనే క్రమంగా ఎదుగుతూ, ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు.

ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం, సాదాసీదా ప్రవర్తనే తన బలమని నిరూపించుకుంటూ వస్తున్న అల్లు అర్జున్, అభిమానులతో ఎంతో సన్నిహితంగా మెలగడం ఆయన ప్రత్యేకత. ఇటీవల నిర్వహించిన ఫ్యాన్ మీట్‌లో కూడా ఎలాంటి స్టార్ ఆర్భాటాలు లేకుండా, సాధారణంగా వ్యవహరించారని అభిమానులు కొనియాడారు. అలాంటి అల్లు అర్జున్‌పై తాజాగా తెరపైకి వచ్చిన ‘ప్రోటోకాల్’ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇటీవల నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటాయని ఆ వీడియోలో ప్రచారం చేశారు. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం రూపొందించిన ప్రోటోకాల్ అంటూ “కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్‌హ్యాండ్ చేయకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు” వంటి నిబంధనలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ వీడియోను ఆసరాగా చేసుకుని కొందరు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దిగారు. ఈ ప్రచారానికి కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అల్లు అర్జున్‌ను కలిసే ముందు తమకు నిబంధనల జాబితా ఇచ్చారని, పలువురు మేనేజర్ల ద్వారా అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందని, ఫొటోషూట్ సమయంలో కూడా కఠిన నియమాలు పాటించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్లిప్‌ను కొందరు కావాలనే వైరల్ చేస్తూ బన్నీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

విషయం ముదిరడంతో అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. “అల్లు అర్జున్ ఎల్లప్పుడూ అందరి పట్ల గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేయవద్దు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే అధికారిక క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్లు తగ్గడం లేదు. యాంటీ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతూ పోస్టులు చేస్తున్నారు. ఇది కొత్త విషయం కూడా కాదు. గతంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సమయంలోనూ, అలాగే నంద్యాలలో వైసీపీ నేత శిల్పా రవికుమార్ ఇంటికి వెళ్లిన సందర్భంలోనూ అల్లు అర్జున్‌పై కొందరు హీరోల అభిమానులు అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేశారు. ఇదంతా కావాలని ఓ వర్గానికి చెందినవారు చేయిస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తనకు ఎలాంటి సంబంధం లేని అంశాల్లో కూడా బన్నీని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం జరుగుతుండటం అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ లీగల్‌గా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఓర్వలేకనే బన్నీని టార్గెట్ చేస్తున్నారా..? దుష్ప్రచారం వెనక ఎవరు ఉన్నారు..? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment