టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు అనుకోని షాక్ తగిలింది. ఓయూ జేఏసీ (ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో అర్జున్ ఇంటిని ముట్టడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై రాళ్లు, టమాటాలతో దాడికి కూడా పాల్పడ్డారు. ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు.
ఈ ఆందోళనకు ప్రధాన కారణం సంధ్య థియేటర్ తొక్కిసలాట. మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు, అన్ని విధాలుగా ఆదుకోవాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా నినాదాలు చేశారు. అల్లు అర్జున్ ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు, టమాటాలు విసిరిన సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో నుంచి బయటకు రాలేదు.
దిష్టిబొమ్మ దహనం..
అల్లు అర్జున్‌పై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ డైరెక్షన్‌లో నడుస్తున్నారని, నిన్న ప్రెస్‌మీట్‌లో చేసిన ప్రసంగం పూర్తిగా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమేనని విమర్శించారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అల్లు అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని, రీల్ లైఫ్‌లో అర్జున్ హీరో అయినా, రియల్ లైఫ్‌లో కాదని మండిపడ్డారు. అనంతరం అల్లు అర్జున్ దిష్టిబొమ్మను దహనం చేశారు.