అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. అరెస్టు, సెక్షన్లపై సుమారు రెండు గంటల పాటు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన తెలిసిందే. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల నుంచి వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని కోర్టు అభిప్రాయపడింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించేమని కోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందన్నారు కోర్టు తెలిపింది. నటుడు కాబట్టి 105, 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా అని ప్రశ్నించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంతమాత్రాన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేమన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు.
4 వారాల పాటు..
బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు సూచించింది. రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని చెప్పింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన అనంతరం బన్నీ జైలు నుంచి బయటకు రానున్నారు.