ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 4వ తేదీన పుష్ప2 ప్రీమియర్ షోను వీక్షించేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్య థియేటర్‌కు బన్నీ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అదే సమయంలో బన్నీ కూడా తన కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటీషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీవర్గాలతోపాటు అభిమానులు షాకయ్యారు. అల్లు అర్జున్‌ను ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంధ్య టాకీస్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై బన్నీ స్పందించారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, తన తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తామని, అలాగే తమ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని, తన వల్ల అయినంత సాయం చేస్తానని బన్నీ ప్రకటించారు.