ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలో భారీ మోసం.. టీడీపీ నేతలపై బాధితుల ఆగ్రహం

ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలో భారీ మోసం.. టీడీపీ నేతలపై బాధితుల ఆగ్రహం

నంద్యాల (Nandyala) జిల్లా ఆళ్లగడ్డ (Allagadda)లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామ‌ని స్థానిక టీడీపీ నేత‌లు (TDP Leaders) ఒక్కో వ్యక్తి నుంచి రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టీడీపీ నేత బాచిరెడ్డి వీరారెడ్డి (Bachireddy Veerareddy), ఆయన అల్లుళ్లు రాజారెడ్డి, సింగతల మహేష్‌రెడ్డి, వీరారెడ్డి భార్య‌ ప్రణతిరెడ్డి, బాచిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ఈ వసూళ్లలో పాల్గొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా కంప్లయింట్‌ తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. “ఉద్యోగం వ‌స్తుంద‌నే ఆశ‌తో ఇళ్లు, బంగారం తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు. యల్లనూరు (Yellanur)లో ఫిర్యాదు చేశామని చెబుతున్నారు కానీ మేము అక్కడ ఇవ్వలేదు. దొర్నిపాడు పీఎస్‌కి వెళ్తే కూడా ఎవరూ కంప్లయింట్ తీసుకోలేదు” అని బాధితులు ఆరోపించారు. బాచిరెడ్డి వీరారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని చెబుతున్నా, వాస్తవానికి కూకట్‌పల్లిలో స్వగృహంలో ఉన్నాడని సాక్ష్యాలు త‌మ ద‌గ్గ‌ర‌ ఉన్నాయని వారు అన్నారు.

పురుగుల మందు డబ్బాల‌తో నిరసన చేపట్టిన బాధితులు, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నిరసన కొనసాగిస్తామన్నారు. “పోలీసులు మాకు సహాయం చేయాలి. ఎవరైనా బలవంతంగా తరలించాలనుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం,” అని హెచ్చరించారు. మోసం చేసిన నాయకులు తక్షణమే లొంగిపోవాలని, డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం బాధితుల నిరసన ఆళ్లగడ్డలో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు, ప్రజా సంఘాలు ఈ ఘటనపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించకపోవడం బాధితులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment