అజిత్‌ విమాన ప్రమాదం.. కొత్త వీడియోతో మళ్లీ వివాదం

అజిత్‌ విమాన ప్రమాదం.. కొత్త వీడియోతో మళ్లీ వివాదం

మహారాష్ట్ర (Maharashtra) మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ ప‌వార్‌ (Ajit Pawar) మరణానికి దారితీసిన బారామతి విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు కొత్త వీడియో వెలుగులోకి రావడం మరింత వివాదానికి దారి తీసింది. అజిత్ పవార్ కుమారుడు జ‌య్‌ ప‌వార్‌ (Jay Pawar) సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ, చార్టర్ విమాన సంస్థ VSR వెంచర్స్‌పై (VSR Ventures) తీవ్ర ఆరోపణలు చేశారు.

జయ్ పవార్ షేర్ చేసిన వీడియోలో, సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తి కాక్‌పిట్‌లో పైలట్ సీటులో నిద్రిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు యూనిఫాం ధరించిన పైలట్ విమానాన్ని నడుపుతున్నట్లు వీడియోలో ఉంది. జయ్ పవార్ ప్రకారం, ఆ వ్యక్తి VSR వెంచర్స్ యజమాని రోహిత్ సింగ్ (Rohit Pawar) అని ఆరోపించారు. “విమాన ప్రయాణంలో ఇలాంటి నిర్లక్ష్యం అసహ్యకరం. ఇది చాలా తీవ్రమైన విషయం” అని ఆయన పేర్కొన్నారు. DGCA వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి విచారణ పూర్తయ్యే వరకు VSR సంస్థకు చెందిన అన్ని విమానాలను గ్రౌండ్ చేయాలని డిమాండ్ చేశారు.

View this post on Instagram

A post shared by Jay Pawar (@jayajitpawar)

ఈ ఘటనపై ఎన్సీపీ (SP) ఎమ్మెల్యే రోహిత్ ప‌వార్‌ (Rohit Pawar) కూడా స్పందించారు. రోహిత్ సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వెంటనే FIR నమోదు చేయాలని పోలీసులను కోరారు. అయితే ఇప్పటివరకు పోలీసులు FIR నమోదు చేయలేదని తెలిపారు. ముంబై, బారామతి పోలీస్ స్టేషన్లు, పుణే CID కార్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా, ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను ఏఏఐబీ విడుదల చేసింది. ప్రమాద సమయంలో విజిబిలిటీ కేవలం 3 కిలోమీటర్లే ఉండగా, విజువ‌ల్ ఫ్లైట్ రూల్స్ (VFR) ప్రకారం కనీసం 5 కిలోమీటర్ల విజిబిలిటీ అవసరమని నివేదిక వెల్లడించింది. బారామతి ఎయిర్‌ఫీల్డ్ VFR ప్రమాణాల ప్రకారమే పనిచేస్తుందని, రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నంలోనే ప్రమాదం జరిగిందని పేర్కొంది. జనవరి 28న ఉదయం సుమారు 8:46 గంటలకు లియ‌ర్‌జెట్‌ 45XR (VT-SSK) విమానం రన్‌వే 11 వద్ద కూలిపోయింది.

ఈ ప్రమాదంలో పైలట్-ఇన్-కమాండ్, ఫస్ట్ ఆఫీసర్, కేబిన్ అటెండెంట్, అజిత్ పవార్ మరియు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును పుణే పోలీస్ CIDకి బదిలీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment