‘అజిత్‌ మ‌ర‌ణం ప్ర‌మాదం కాదు.. హ‌త్య’ – రామ్మోహ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

'అజిత్‌ మ‌ర‌ణం ప్ర‌మాదం కాదు.. హ‌త్య' - రామ్మోహ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. జ‌న‌వ‌రి 28వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న VSR సంస్థకు చెందిన ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్‌ బారామతిలో కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురు చనిపోయారు. అజిత్ పవార్‌ విమాన ప్రమాదంపై ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలతో సంబంధాలపై ఆరోపణ
విమానయాన సంస్థ VSR యజమాని రోహిత్ సింగ్‌కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. “దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవి నుంచి తప్పుకోవాలి” అని రోహిత్ ప‌వార్‌ డిమాండ్ చేశారు.

భారీ లావాదేవీలు..
ఈ ఘటన వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు దాగి ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. రూ.35 కోట్ల విలువ చేసే విమానానికి రూ.210 కోట్ల బీమా ఎందుకు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. “ప్రమాదం సమయంలో విమానంలోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారు. పైలట్‌ను బ్లాక్‌మెయిల్ చేసి ప్రమాదం చేయించి ఉండొచ్చు” అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

దేశం విడిచివెళ్లిపోయిన రోహిత్ సింగ్‌
విచారణ పూర్తికాకముందే రోహిత్ సింగ్‌కు దేశం విడిచి అమెరికా వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. “ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా?” అని నిలదీశారు. ప్రమాదానికి కీలకమైన బ్లాక్‌బాక్స్ సురక్షితంగా ఉన్నప్పటికీ, అది పాడైపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

బాధ్యులెవ‌రూ..
ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర సంస్థతో సమగ్ర దర్యాప్తు జరగాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. బాధ్యులెవ్వరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన రావాల్సి ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం ఎన్సీపీ నేత ఆరోప‌ణ‌ల‌పై ఏ విధంగా స్పందిస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండడం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment