గచ్చిబౌలి (Gachibowli)లోని ప్రసిద్ధ AIG ఆస్పత్రి (Hospital)లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఆస్పత్రి మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. సమయస్ఫూర్తితో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో భయాందోళనకు కారణమైంది.
వీఐపీ పేషంట్లు (VIP Patients) తరచూ సేవలు పొందే ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ (Fire Safety) ప్రమాణాలు పాటించడం ఎలా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.