భారత్-పాక్‌ మ్యాచ్ రద్దుపై షహీద్ అఫ్రిది ఫైర్: ‘క్రికెట్‌లో రాజకీయాలు వద్దు!’

భారత్-పాక్‌ మ్యాచ్ రద్దుపై షహీద్ అఫ్రిది ఫైర్: 'క్రికెట్‌లో రాజకీయాలు వద్దు!'

మ్యాచ్ రద్దు: భారత ఆటగాళ్ల నిర్ణయంపై అఫ్రిది ఆగ్రహం
జూలై 20న బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడమే ఇందుకు కారణం. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేసి క్షమాపణలు చెప్పారు. శిఖర్ ధావన్ తన లేఖ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పాకిస్థాన్‌తో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో ఎలాంటి మ్యాచ్ ఆడబోనని స్పష్టం చేశాడు. హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కూడా మ్యాచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షహీద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల నిర్ణయాన్ని విమర్శిస్తూ, క్రికెట్‌లో రాజకీయాలు వద్దని అతను పిలుపునిచ్చాడు.

ఈ పరిణామంపై షహీద్ అఫ్రిది స్పందిస్తూ, “ఆడటం ఇష్టం లేకపోతే మ్యాచ్ కోసం రావడమే ఎందుకు?” అని ప్రశ్నించాడు. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారని గుర్తు చేస్తూ, “మేము క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాం. పాకిస్థాన్‌తో ఆడటం ఇష్టం లేకపోతే, మొదట రావద్దని చెప్పి ఉండాలి. ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత వద్దు అనడం ఏంటి? ఒక్క రోజులో అన్నీ మారిపోయాయి. ఆటలు మనుషులను దగ్గర చేస్తాయి. కానీ రాజకీయాలు ప్రతిదానిలో కలిస్తే, మనం ఎలా ముందుకు వెళ్తాం? కూర్చుని మాట్లాడనంత కాలం, ఏమీ మారదు” అని అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

“క్రికెట్ రాజకీయాల కంటే గొప్పది”
కొన్ని మీడియా వార్తల ప్రకారం, పహల్గామ్ దాడి తర్వాత షహీద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే భారత ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసి మ్యాచ్ నుంచి తప్పుకున్నారని అంటున్నారు. దీనిపై అఫ్రిది స్పందిస్తూ, “క్రికెట్ ముందు నేను ఏమీ కాదు” అని అన్నాడు. “నా వల్ల మ్యాచ్ రద్దవుతుందని నాకు తెలిసి ఉంటే, నేను గ్రౌండ్‌కు కూడా వచ్చేవాడిని కాదు. కానీ క్రికెట్ ఆగకూడదు. షహీద్ అఫ్రిది కంటే క్రికెట్ చాలా గొప్పది. ఆట ముందు వస్తుంది. రాజకీయాలను మధ్యలోకి తేవడం లేదా భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడమని చెబితే, ఆడకండి, ఇంట్లో కూర్చోండి. కానీ క్రికెట్ పెద్దది” అని అఫ్రిది గట్టిగా చెప్పాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment