అఫ్గానిస్థాన్ (Afghanistan)లో మళ్లీ ప్రకృతి ప్రళయం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్ (Kunar Province)లో రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ ఘోర విపత్తులో దాదాపు 600 మంది మృతిచెందగా, మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారని రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ ప్రకటించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో, 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది.
ఈ ప్రకంపనలతో కునార్, నోరిస్థాన్, నంగర్హార్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు గ్రామాలు శిథిలమవగా, వందలాది ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు గాయాలతో కకావికలమై ఇబ్బందులు పడుతున్నారని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విపత్తును ఎదుర్కోవడంలో తాలిబన్ ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున, అంతర్జాతీయ సమాజం మరియు మానవతా సంస్థలు తక్షణమే ముందుకు రావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహారం, వైద్యం, నీరు, ఆశ్రయం వంటి అత్యవసర సహాయం అవసరమని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో భూకంప దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, మరిన్ని ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.








